- బీసీ సంక్షేమ, రవాణా శాఖ..మంత్రి పొన్నం ప్రభాకర్
మానకొండూర్ (తిమ్మాపూర్), వెలుగు: విద్యార్థులు కష్టపడి చదివి తమ తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చాలని బీసీ సంక్షేమ, రవాణా శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. మహాత్మా జ్యోతిబాపూలే ఉమ్మడి గురుకులాల జిల్లాస్థాయి క్రీడాపోటీల ముగింపు సభను మంగళవారం సాయం త్రం తిమ్మాపూర్ లో నిర్వహించారు. చీఫ్ గెస్ట్ గా హాజరైన మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు 1,029 ఉన్నాయని, వీటిల్లో1.50లక్షల మంది విద్యార్థులు చదువుతున్నార న్నారు. ప్రభుత్వ స్కూళ్లను సక్రమంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గురుకులాల్లో చదివిన ఎంతోమంది నేడు ఉన్నత స్థానాల్లో ఉన్నారని గుర్తు చేశారు. అన్ని గురుకులాల్లో సోలార్ వాటర్ హీటర్లు, ఆర్వో వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఒక్కో విద్యార్థికి రెండు జతల నైట్ డ్రెస్సులు ఇస్తామన్నారు. అన్ని వసతులు కల్పిస్తామని, ఉన్నత ర్యాంకులు సాధించాలని విద్యార్థులను మంత్రి కోరారు. ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, కలెక్టర్ పమేలా సత్పతి, ఎంజేపీ సొసైటీ జాయింట్ సెక్రటరీ తిరుపతయ్య, ఆర్సీవో అంజలి, ఎల్ఎండీ ప్రిన్సిపాల్ సరిత పాల్గొన్నారు.